ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జితేంద్ర సింగ్ తాజాగా వెల్లడించారు. భారత్‌ వద్ద ఉన్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌ను తీవ్రంగా కలవరపెట్టిందని ఆయన తెలిపారు. ‘సుదర్శన చక్రం’గా అభివర్ణించిన ఎస్-400 జాడను గుర్తించేందుకు పాకిస్థాన్‌ అనేక ప్రయత్నాలు చేసిందని చెప్పారు.

ఇతర దేశాల శాటిలైట్లను ఉపయోగించి కూడా ఎస్-400 స్థానాన్ని గుర్తించే ప్రయత్నాలు జరిగాయని, చివరకు భారత్‌లోని గూఢచార స్లీపర్ సెల్స్‌ను సైతం క్రియాశీలకం చేసి దాని జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పాక్ యుద్ధ విమానం గగనతలంలోకి వచ్చిన ప్రతిసారీ ఎస్-400ను ఉపయోగించి ఎదుర్కొనేవాళ్లమని నాటి పరిస్థితులను వివరించారు.

భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థలో ఎస్-400 కీలకంగా మారింది. రష్యా రూపొందించిన ఈ వ్యవస్థ అత్యాధునిక రాడార్ సాంకేతికతతో శత్రు విమానాలను సుదూరం నుంచే గుర్తించగలదు. భూమి నుంచి ప్రయోగించే క్షిపణులతో గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది.

2018లో రష్యాతో భారత్‌ ఐదు ఎస్-400 వ్యవస్థల కోసం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే మూడు వ్యవస్థలు భారత వాయుసేనలో చేరాయి. నాలుగో వ్యవస్థ ఈ ఏడాది జూన్‌లో భారత్‌కు చేరినట్లు సమాచారం.