మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పరిశుభ్రత, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనల కారణంగా నాలుగు డొమినోస్ పిజ్జా ఔట్‌లెట్లు, ఒక పిజ్జా హట్ ఔట్‌లెట్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో ఈ చర్యలు తీసుకుంది.
తనిఖీల్లో డొమినోస్ ఔట్‌లెట్లలో పిజ్జా తయారీ యంత్రాల్లో పేరుకుపోయిన జిడ్డు, కీటకాల ఉనికి, సరైన పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, అపరిశుభ్రమైన వంటగదులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పిజ్జా హట్ ఔట్‌లెట్‌లో గడువు తేదీలు లేని ఆహార పదార్థాలు వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు.
మహారాష్ట్ర ఆహార భద్రత విభాగం ఇటీవల రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేసింది. ఒక్క రోజులోనే 100కుపైగా ఔట్‌లెట్లను తనిఖీ చేసి, 95 కేంద్రాలకు వివిధ లోపాలపై మెరుగుదల నోటీసులు జారీ చేసింది.
ఆహార భద్రత నిబంధనలు పాటించని సంస్థలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. సస్పెన్షన్‌పై సంబంధిత సంస్థలు ఇప్పటివరకు వివరణాత్మక ప్రకటన విడుదల చేయలేదు.









