ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కృత్రిమ మేధ (AI)ను సమర్థంగా వినియోగించాలని, అయితే తుది నిర్ణయాల్లో మానవ విచక్షణ, తీర్పు తప్పనిసరిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో నిర్వహించిన మూడో ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు.

విధానాల రూపకల్పనలో కొత్త ఆలోచనలు, భిన్నమైన దృక్కోణాలు తీసుకురావడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం అవసరమని మోదీ అన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు దీర్ఘకాలిక ఆలోచనా విధానంతో పనిచేయాలని సూచించారు.

డేటాను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ప్రధాని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం డేటాను సేకరించడం, నిర్వహించడం వంటి అంశాల్లో శాఖల మధ్య భిన్నమైన విధానాలు ఉన్నాయని గుర్తుచేస్తూ, డేటా పరస్పర వినియోగానికి వీలుగా వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు.

ప్రభుత్వ శాఖలు విడివిడిగా పనిచేయడం కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఆలోచనా విధానానికి సంబంధించిన సమస్య కూడా అని మోదీ వ్యాఖ్యానించారు. అన్ని శాఖలు పరస్పర సహకారంతో, సమష్టి బాధ్యతతో పనిచేయాలని కోరారు.

అధికారుల మధ్య అనౌపచారిక పరస్పర చర్చలు, టీమ్ స్పిరిట్ పెంపొందించడం కూడా ముఖ్యమని ప్రధాని సూచించారు. అదే సమయంలో దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసి, ప్రపంచ స్థాయిలో పోటీపడేలా భారత రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.