భారత్-మంగోలియా ఆధ్యాత్మిక బంధానికి ప్రతీకగా, గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాల (Sacred Relics)లోని ఒక భాగాన్ని భారత వైమానిక దళం (IAF) ప్రత్యేకంగా మంగోలియాకు తరలించింది. శనివారం ఢిల్లీ నుంచి IAFకు చెందిన IL-76 ‘గజరాజ్’ విమానం ద్వారా ఈ అవశేషాలను మంగోలియాకు పంపించారు.
బౌద్ధ ప్రపంచంలో జ్ఞానం, కరుణ, జాగృతికి చిహ్నాలుగా భావించే ఈ పవిత్ర అవశేషాలు మంగోలియాలో ప్రత్యేక ప్రదర్శన కోసం తీసుకెళ్లబడుతున్నాయి. ఈ సందర్భంగా భారత వైమానిక దళం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చిత్రాలను పంచుకుంటూ, ఈ మిషన్ కేవలం అవశేషాల రవాణా మాత్రమే కాకుండా విశ్వాసం, వారసత్వం, స్నేహబంధాన్ని ఖండాల మధ్య మోసుకెళ్లిన చారిత్రక క్షణమని పేర్కొంది.
భారత్ మరియు మంగోలియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న బౌద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేయనుందని అధికారులు తెలిపారు.














