బీహార్‌లోని Aurangabad జిల్లాలో చిన్నారి ఆద్విక్ అపహరణ కేసును చేధించేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఊహించని విధంగా మరో సంచలన నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మే 16న కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల ఆద్విక్‌ను రక్షించేందుకు పోలీసులు ఒబ్రాలోని రంజూ దేవి నివాసంపై దాడి చేశారు. అక్కడ ఆద్విక్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన పోలీసులు, అదే ఇంట్లో మరో బాలుడు ఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. విచారణలో అతడు 2022 నుంచి అదృశ్యమైన శివమ్ అని తేలింది.
వాట్ సావిత్రి పూజ సమయంలో ఒబ్రాలోని ఆలయం సమీపం నుంచి శివమ్ కనిపించకుండా పోయినట్లు అప్పట్లో కేసు నమోదైంది. అయితే, అతడే తన సొంత కుమారుడని రంజూ దేవి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ అధికారులు లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. అనంతరం శివమ్‌ను అతని అసలు కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
నాలుగేళ్ల అనంతరం తన తల్లిని చూసిన శివమ్ మొదట కొంత భయాందోళనకు గురైనప్పటికీ, కాసేపటికే భావోద్వేగంతో ఆమె ఒడిలోకి చేరాడు. తన కుమారుడిని తిరిగి చూసిన శాంతి పాండే కన్నీటి పర్యంతమై బిడ్డను హత్తుకోవడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ ఘటనతో పోలీసుల సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇద్దరు చిన్నారులను వారి కుటుంబాలతో మళ్లీ కలిపి, పోలీసులు తమ బాధ్యతను గొప్పగా నిర్వర్తించారు,” అని ఒబ్రా ఎమ్మెల్యే ప్రకాశ్ చంద్ర అభినందించారు.












