టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)కు మరో భారీ పెనాల్టీ క్లెయిమ్ వచ్చింది. ముంబైలోని ప్రముఖ తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌కు సంబంధించి బకాయి ఆస్తి పన్నుపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తాజాగా రూ.5.51 కోట్లకు పైగా పెనాల్టీని విధించింది.
2026-27 ఆస్తి పన్ను బిల్లులో ఈ అదనపు పెనాల్టీని చూపించినట్లు IHCL రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. రూ.5,51,35,972 అదనపు పెనాల్టీ క్లెయిమ్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఇప్పటికే ఉన్న పెనాల్టీతో కలిపి తాజ్ ల్యాండ్స్ ఎండ్‌కు సంబంధించిన మొత్తం పెనాల్టీ రూ.103,08,31,312కు చేరింది. ఈ అంశంపై గతంలో ఫిబ్రవరి 13, 2026న కంపెనీ వెల్లడించింది.
అయితే ఈ ఆస్తి పన్ను బిల్లులను కంపెనీ వివాదాస్పదంగా పేర్కొంది. తమ వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని IHCL స్పష్టం చేసింది. బకాయి ఆస్తి పన్ను, పెనాల్టీకి సంబంధించిన క్లెయిమ్‌లను కంపెనీ ప్రస్తుతం డిస్ప్యూట్ చేస్తోంది.









