తమిళనాడు, ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం ఏనుగు శిబిరంలో 40 ఏళ్ల వయసున్న చెరన్ అనే బందీ ఏనుగు బుధవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు పశుసంవర్ధక శాఖ యానిమల్ డిసీజ్ ఇంటెలిజెన్స్ యూనిట్ వైద్యులు కూడా శిబిరానికి చేరుకున్నారు. ఏనుగు అంతర్గత అవయవాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఎంఢీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.జి. గణేశన్ మాట్లాడుతూ, చెరన్ గతంలో ఇతర ఏనుగులతో పోట్లాటల్లో పాల్గొన్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టంలో అంతర్గత అవయవాలు దెబ్బతిన్నట్లు గుర్తించామని, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చని చెప్పారు.
అయితే, ఇతర ఏనుగుల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడంతో ఇది అంటువ్యాధి కారణంగా జరిగి ఉండే అవకాశం తక్కువేనని అధికారులు భావిస్తున్నారు. వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కారణమా అన్నదానిపై మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.















