కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నాగేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించిన నాగేంద్ర.. తన నిర్ణయానికి గల కారణాలను చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
“ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర ఆరోపణల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే నా సొంత నిర్ణయంతో రాజీనామా చేస్తున్నాను” అని నాగేంద్ర తెలిపారు.
అదే సమయంలో బీజేపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ‘మనువాది’ రాజకీయాలు చేస్తోందని, తాను కూడా ఆ రాజకీయాలకు బాధితుడినేనని వ్యాఖ్యానించారు.
ఈ అంశం కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ, జేడీఎస్ సభ్యులు అసెంబ్లీ లోపల, బయట ఆందోళనలు చేపట్టారు. నిరసనలు కొనసాగడంతో సమావేశాలు నిర్ణీత సమయం కంటే మూడు రోజుల ముందుగానే ఆగస్టు 24న ముగిశాయి.
మరోవైపు ప్రతిపక్షాలు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూర్ నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నాగేంద్ర రాజీనామా కూడా వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది.
అసలు ఏంటీ వాల్మీకి స్కామ్?
2024 మేలో మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కార్పొరేషన్‌లో అకౌంట్స్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన పీ. చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసిన ఆరు పేజీల లేఖలో కార్పొరేషన్‌లో ఆర్థిక అవకతవకలు, నిధుల అక్రమ బదిలీలపై ఆరోపణలు చేశారు.
దర్యాప్తులో కార్పొరేషన్‌కు చెందిన ఖాతా నుంచి ₹89.63 కోట్లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ నగదు పలు ఖాతాల ద్వారా బదిలీ కావడం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది.












