ఉత్తర అమెరికాలోని అతిపెద్ద తెలుగు సాంస్కృతిక వేడుకల్లో ఒకటైన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో సంగీతాభిమానులను అలరించేందుకు 'ఝుమ్మండి నాదం' నాన్-క్లాసికల్ సీనియర్ సంగీత పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీల నాన్-క్లాసికల్ సీనియర్ ఫైనల్స్లో ఎంపికైన ప్రతిభావంతులైన గాయకులు సినీ గీతాలు, మెలోడీలు, లైట్ మ్యూజిక్ ప్రదర్శనలతో తమ గాన ప్రతిభను ఆవిష్కరించనున్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు యువతలో సంగీతంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీలకు ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు, గేయరచయితలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. కళారత్న శ్రీ పారుపల్లి ఎస్. రంగనాథ్, ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి సునీత, స్వర సమ్రాట్ డాక్టర్ ఐ. శరత్ చంద్ర, జాతీయ అవార్డు గ్రహీత గేయరచయిత కసర్ల శ్యామ్, శ్రీమతి శ్రీదేవి అయ్యగారి, జానపద గాయకుడు, గేయరచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, ప్రముఖ గాయని శ్రీమతి స్వాతి రెడ్డి, శ్రీమతి సమీర శ్రీపాద తమ అనుభవంతో పోటీదారుల ప్రదర్శనలను అంచనా వేయనున్నారు.
ఈ కార్యక్రమం ఆగస్టు 1, శనివారం ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లోని రూమ్ నెం. 309లో నిర్వహించబడుతుంది. ప్రవాస తెలుగు కుటుంబాలు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీదారులను ప్రోత్సహించనున్నారు.
ఝుమ్మండి నాదం కమిటీ చైర్ సుధా కొండపు ఆధ్వర్యంలో, కో-చైర్లు నవీన్ సరగడం, కృష్ణ పొదగట్లపల్లి, సలహాదారులు, కమిటీ సభ్యులు ఈ సంగీత పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలుగు భాష, సంస్కృతి, సంగీతం, సాహిత్యం, యువత ప్రతిభ, వినోదం, సామాజిక సేవా కార్యక్రమాలతో వైభవంగా జరుగనున్న 19వ ATA మహాసభల్లో, 'ఝుమ్మండి నాదం' నాన్-క్లాసికల్ సీనియర్ ఫైనల్స్ సంగీత ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యువ గాయకులకు ప్రపంచ వేదికపై తమ ప్రతిభను చాటుకునే అరుదైన అవకాశంగా ఈ కార్యక్రమం నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.












