ఫీనిక్స్ (అరిజోనా): దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. సేవే పరమావధిగా భావించిన వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రాణాలను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన శిబిరం 2026 సెప్టెంబర్ 6 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టెంపీ డోనర్ సెంటర్, 1524 వెస్ట్ 14వ స్ట్రీట్, టెంపీ, అరిజోనాలో జరగనుంది. అమెరికాలో ప్రముఖ లాభాపేక్షలేని రక్త సేకరణ సంస్థ వైటలాంట్ (Vitalant) సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అలూరు సాంబశివరెడ్డి జూమ్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరై పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశముందని, ప్రతి ఆరోగ్యవంతుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు.
రక్తదానం చేయాలనుకునే వారు Vitalant వెబ్‌సైట్‌లో Blood Drive Code: 100562888 ఉపయోగించి ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కార్యక్రమ పోస్టర్‌లోని QR కోడ్ స్కాన్ చేసి కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
వైఎస్సార్ జీవితమంతా ప్రజాసేవకే అంకితమైందని, ఆయన వర్ధంతిని కేవలం స్మరించుకోవడమే కాకుండా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన మానవతా భావాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.









