అమెరికాలో 23 ఏళ్ల పాటు జీవించిన ఓ NRI తిరిగి ముంబైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో స్థిరమైన కెరీర్, సొంత వ్యాపారం ఉన్నప్పటికీ.. కుటుంబంతో గడపడం, ముఖ్యంగా వృద్ధ తల్లికి అండగా ఉండటం కోసం భారత్‌కు తిరిగి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

15 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లిన ఆయన న్యూయార్క్‌లోని ఓ కాలేజీలో బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. అనంతరం ఫార్మాస్యూటికల్ రంగంలో ఉద్యోగం సంపాదించారు. కంపెనీ స్పాన్సర్ చేసిన H-1B వీసాపై పనిచేసిన ఆయన ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.

అయితే తండ్రి క్యాన్సర్‌తో 70 ఏళ్ల వయసులో మరణించడం ఆయన జీవితంలో కీలక మార్పుకు కారణమైంది. అప్పటికే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి ప్రవేశించారని, తల్లి భారత్‌లోనే ఉండిపోయారని ఆయన తెలిపారు. తండ్రి మరణం తర్వాత తల్లికి అండగా ఉండాలనే ఆలోచన తనలో బలపడిందన్నారు.

అమెరికాలో తన జీవితం స్థిరంగా ఉన్న సమయంలోనే భారత్‌కు తిరిగి రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2018లో తొలిసారి భారత్‌కు తిరిగి వచ్చారు. 2020లో మరోసారి భారత్‌కు వచ్చిన సమయంలో కోవిడ్-19 మహమ్మారి పరిణామాలు కూడా తన ఆలోచనలను ప్రభావితం చేశాయని తెలిపారు.

2022లో అమెరికాకు తిరిగి వెళ్లిన ఆయన ఫార్మా ఉద్యోగానికి రాజీనామా చేసి, తన కంపెనీని విక్రయించి భారత్‌కు తిరిగివచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. 2023లో పెన్సిల్వేనియాలోని తన ఇంటిని విక్రయించి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అనంతరం భారతీయ కంపెనీల కోసం కన్సల్టింగ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్టులపై పనిచేశారు.

తన నిర్ణయాన్ని వివరిస్తూ “It just felt safer in Mumbai” అని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికాకు వెళ్లే ముందు తనతో ఉన్న చిన్ననాటి స్నేహితులతో మళ్లీ అనుబంధం ఏర్పడటం కూడా తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

అమెరికాలోని స్నేహితులు, అక్కడి జీవనశైలి అప్పుడప్పుడు గుర్తొస్తాయని ఆయన అంగీకరించారు. అయితే తల్లితో కలిసి ఇంటి భోజనం చేయడం, సాయంత్రం టీ తాగుతూ మాట్లాడటం, బంధువులు, పాత స్నేహితులతో సమయం గడపడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు.

ఆయన కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందించారు. అయితే ఇవి ఆ వ్యక్తి వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలేనని గమనించాలి.