అమెరికాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు విద్యార్థిని అట్లూరి ప్రసన్న (25) న్యూయార్క్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామానికి చెందిన ప్రసన్న, జులై 5న వారాంతపు సెలవు సందర్భంగా తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం బలంగా ఢీకొట్టింది.
న్యూయార్క్ స్టేట్ పోలీసుల వివరాల ప్రకారం, ప్రసన్న ప్రయాణిస్తున్న వాహనం ట్రాఫిక్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా కూడలిలోకి వెళ్లడంతో, గ్రీన్ సిగ్నల్‌తో వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలుగు విద్యార్థిని అకాల మరణం ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.












