అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీ 2026 బ్యాచ్ స్నాతకోత్సవంలో ప్రవాసాంధ్ర విద్యార్థిని సరయు బేతంచూర్ల కీలకోపన్యాసం ఆకట్టుకుంది. మిషిగన్ రాష్ట్రం ట్రాయ్‌కు చెందిన సరయు, సీనియర్ క్లాస్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా విద్యార్థుల తరపున మాట్లాడారు.
తన నాలుగేళ్ల విశ్వవిద్యాలయ జీవితంలో అనేక మార్పులు చూసినట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు తెరిచి ఉండే క్యాంపస్ గేట్లు ఇప్పుడు భద్రతా కారణాలతో మూసివేయబడుతున్నాయని పేర్కొన్నారు. కొలంబియా ఒకే సమాజం కాదు, భిన్నమైన కమ్యూనిటీల సమాహారమని ఆమె అభివర్ణించారు.
న్యూయార్క్ నగర జీవితం విద్యార్థులకు వయోజన జీవితానికి ఒక “ఉచిత ట్రయల్” లాంటిదని సరయు చెప్పారు. ఇంటికి దూరంగా ఉంటూ విద్యార్థులు ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకున్నారని అన్నారు. ఇటీవలి సంఘటనలతో విద్యార్థి జీవితం మరింత సవాళ్లతో మారిందని, అయినప్పటికీ పరస్పర అండదండలే కొలంబియా ప్రత్యేకత అని పేర్కొన్నారు.
భిన్నాభిప్రాయాలను అర్థం చేసుకోవాలని, బలహీనుల పక్షాన నిలబడాలని విద్యార్థులకు ఆమె పిలుపునిచ్చారు. “సరైన అభిప్రాయం కలిగి ఉండటం కంటే, భిన్నమైన అనుభవాలను అర్థం చేసుకోవడం ముఖ్యం” అని ఆమె సందేశమిచ్చారు.












