టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగర నూతన మేయర్‌గా మార్క్ హిల్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తన తొలి సందేశాన్ని విడుదల చేశారు. తనపై విశ్వాసం ఉంచి మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఇటీవల నిర్వహించిన నగర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఫ్రిస్కో ఐక్యత, ప్రజల సేవాభావం, నగర అభివృద్ధిని కొనియాడుతూ.. "మన ఉత్తమ రోజులు ఇంకా ముందే ఉన్నాయి" అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్రిస్కో ఒక ప్రత్యేకమైన నగరమని పేర్కొన్న మార్క్ హిల్.. ఇక్కడ స్థిరపడేందుకు ఎంతో మంది తమ జీవితాల్లో ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. తమ కుటుంబాల భవిష్యత్తు, పిల్లల నాణ్యమైన విద్య, వ్యాపారాభివృద్ధి కోసం ఫ్రిస్కోను నివాసంగా ఎంచుకున్నారని చెప్పారు.
దశాబ్దాలుగా దూరదృష్టి కలిగిన నాయకత్వం, బాధ్యతాయుతమైన పౌరులు, అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిసి ఫ్రిస్కోను అవకాశాల నగరంగా తీర్చిదిద్దాయని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన కార్యక్రమంలో సమాజానికి సేవ చేస్తున్న యువ బాయ్ స్కౌట్స్, దేశానికి సేవలందించిన వెటరన్స్, నగరాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న వందలాది మంది నివాసితులు పాల్గొనడం ఫ్రిస్కో బలాన్ని ప్రతిబింబించిందని తెలిపారు.
"మనం ఒకటిగా నిలుస్తాం.. కలిసికట్టుగా ముందుకు సాగుతాం.. విజయాన్ని సాధిస్తాం. ఫ్రిస్కోకు అత్యుత్తమ రోజులు ఇంకా ముందే ఉన్నాయి. ప్రజలతో కలిసి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాను" అని మేయర్ మార్క్ హిల్ తన సందేశంలో పేర్కొన్నారు.


















