రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలకు ఉద్దేశించిన అమెరికా బిల్లులో భారత్ పేరును ప్రత్యేకంగా చేర్చేందుకు ఓ అమెరికా చట్టసభ్యుడు సవరణను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే భారత్‌పై భారీ వాణిజ్య సుంకాలు విధించే అవకాశం ఉంది.
అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం రష్యా, ఇరాన్‌పై ఆంక్షలను కఠినతరం చేసే ‘సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్’పై చర్చ జరుగుతోంది. ఈ బిల్లులో రష్యాతో భారీగా వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై అదనపు ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి చర్యలు ప్రతిపాదించారు.తాజాగా ప్రతిపాదించిన సవరణలో భారత్, చైనా సహా రష్యా చమురును కొనుగోలు చేసే ప్రధాన దేశాల పేర్లను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే సంబంధిత దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంటుంది.
రష్యా నుంచి వచ్చే ఇంధన ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి ఆర్థికంగా సహకరిస్తోందని అమెరికా చట్టసభ్యులు వాదిస్తున్నారు. అందుకే రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది.అయితే ఈ సవరణ ఇంకా చట్టంగా మారలేదు. బిల్లుకు సంబంధించి పలు ప్రత్యామ్నాయ సవరణలు ప్రతిపాదించడంతో తుది రూపం ఎలా ఉంటుందన్నది ఇంకా స్పష్టంగా లేదు. ప్రతినిధుల సభలో ఓటింగ్ అనంతరం మాత్రమే తదుపరి పరిణామాలు తేలనున్నాయి.
భారత్‌కు ఈ ప్రతిపాదన ఆర్థికంగా, దౌత్యపరంగా కీలకంగా మారే అవకాశం ఉంది. దేశ అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరకు ఇంధనం లభించే మార్గాలను ఎంచుకునే హక్కు తమకు ఉందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ప్రస్తుత ప్రతిపాదన తుది చట్టంగా మారితే అమెరికా మార్కెట్‌పై ఆధారపడే భారతీయ ఎగుమతిదారులకు అదనపు వ్యయభారం, వాణిజ్య అనిశ్చితి ఎదురయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా మరోసారి చర్చ మొదలైంది.













