ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో భారత సంతతికి చెందిన హరిందర్‌పాల్ అథ్వాల్‌కు 11 సంవత్సరాలు 3 నెలల జైలు శిక్ష విధించారు. గత ఏడాది డిసెంబర్‌లో బర్మింగ్‌హామ్‌లోని సోహో రోడ్డుపై కారు నడుపుతూ ఫుట్‌పాత్‌పై నడుస్తున్న దంపతులను ఢీకొట్టడంతో 54 ఏళ్ల భర్త అక్కడికక్కడే మృతి చెందగా, 47 ఏళ్ల భార్య తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన తర్వాత ఆగకుండా అక్కడి నుంచి పారిపోయిన అథ్వాల్‌ను పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. అతడు ప్రమాదకర డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ప్రమాదం జరిగిన తర్వాత సహాయం చేయకుండా పారిపోవడం వంటి కేసుల్లో దోషిగా ఒప్పుకున్నాడు. కోర్టు అతనికి 20 ఏళ్ల పాటు డ్రైవింగ్ నిషేధం కూడా విధించింది. బాధితురాలు తన భర్త లేక జీవితం పూర్తిగా శూన్యంగా మారిపోయిందని భావోద్వేగంగా తెలిపింది.