న్యూయార్క్‌లో జరిగిన విషాదకర ఘటనలో భారత సంతతికి చెందిన 24 ఏళ్ల యువతి, ఆమె స్నేహితుడు సబ్‌వే రైలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు.

మృతులను న్యూజెర్సీకి చెందిన మలైకా చిత్ర, సేయర్‌విల్లేకు చెందిన నవమ్ కౌల్గా గుర్తించారు. వీరిద్దరూ రట్జర్స్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ఇటీవలే తమ కెరీర్‌ను ప్రారంభించారు.

ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో లోయర్ మాన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో జరిగింది. ఇద్దరూ రైలు పట్టాలపై ఉన్న సమయంలో దక్షిణ దిశగా వెళ్తున్న నంబర్ 4 రైలు అక్కడికి వచ్చింది. వారిని గమనించిన రైలు ఆపరేటర్ అత్యవసర బ్రేకులు వేసినా, రైలును సకాలంలో ఆపలేకపోయారు. ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

వీరిద్దరూ పట్టాలపైకి ఎలా వెళ్లారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ముందుగా నవమ్ కౌల్ పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని, అతడిని రక్షించేందుకు మలైకా కూడా అక్కడికి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తులో ఒక కోణాన్ని పరిశీలిస్తున్నారు. రైలు రాకముందు ఇద్దరూ పట్టాలపై కూర్చున్నట్లు కనిపించే వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వారు ఎందుకు పట్టాలపైకి వెళ్లారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం లేదా ఇతర కారణాల వల్ల వారికి ప్రమాదం పూర్తిగా అర్థం కాలేకపోయి ఉండొచ్చన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.

మలైకా ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తూ, ఇటీవల డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువును ప్రారంభించారు. నవమ్ న్యూయార్క్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు.