జార్జియాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. కాంగ్రెస్‌మన్ మెక్‌కార్మిక్ కార్యాలయం ఆధ్వర్యంలో ఉచిత జాబ్ ఫెయిర్‌ను జూలై 30న నిర్వహించనున్నారు. ఆల్ఫరెట్టాలోని అట్లాంటా మ్యారియట్ హోటల్‌లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ జాబ్ ఫెయిర్‌లో హెల్త్‌కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, రిటైల్, పబ్లిక్ సర్వీస్ వంటి రంగాలకు చెందిన స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయి సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి.

జార్జియా రాష్ట్రంలోని ప్రతి నివాసితుడు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముందస్తు నమోదు అవసరం లేదు. అభ్యర్థులు తమ తాజా రెజ్యూమేలను వెంట తీసుకురావడంతో పాటు ప్రొఫెషనల్ దుస్తుల్లో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.

అంతేకాకుండా, ఇంటర్వ్యూల్లో ఎలా విజయవంతంగా పాల్గొనాలి, ప్రొఫెషనల్ డ్రెస్సింగ్, కార్యాలయ మర్యాదలు వంటి అంశాలపై ప్రత్యేకంగా జాబ్ రెడీనెస్ టిప్స్ కూడా అందించనున్నారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.