అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం, పిస్కటావేలో కొత్తగా ప్రారంభమైన పటేల్ బ్రదర్స్ ఇండియన్ గ్రోసరీ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఊహించని రీతిలో భారీ రద్దీ నెలకొంది. న్యూజెర్సీలోని పిస్కాటవేలో ప్రారంభమైన ఈ స్టోర్‌లో ప్రారంభ ఆఫర్లను ప్రకటించడంతో వందలాది మంది భారతీయులు ఒకేసారి తరలివచ్చారు.
ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పర్వల్ (Pointed Gourd) కూరగాయను కేవలం $1.99 (సుమారు రూ.170)కు విక్రయిస్తామని ప్రకటించడంతో కొనుగోలుదారులు భారీగా బారులు తీశారు. కూరగాయలను ముందుగా దక్కించుకునేందుకు పలువురు ఒకరినొకరు తోసుకుంటూ షాపింగ్ చేయడం, ట్రాలీలతో రద్దీ సృష్టించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టోర్ సిబ్బంది రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఒక్కసారిగా వచ్చిన జనసందోహంతో పరిస్థితి కొంతసేపు అదుపు తప్పింది. పార్కింగ్ ప్రదేశంలో కూడా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ దృశ్యాలను విమర్శిస్తుండగా, మరికొందరు అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు.












