అమెరికా రాజకీయ నాయకత్వానికి తొలి మెట్టుగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక "అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్" వేదికపై ఓ తెలుగు యువకుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని 49 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి ఎంపికైన అత్యుత్తమ 100 మంది విద్యార్థుల మధ్య జరిగిన పోటీలో నార్త్ కరోలినా ప్రతినిధి క్రిష్ కొర్రపాటి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై తెలుగు వారి ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై నిలబెట్టాడు.
అమెరికాలోని హైస్కూల్ సీనియర్ విద్యార్థులకు నిర్వహించే ఈ కార్యక్రమం సాధారణ పోటీ కాదు. ముందుగా రాష్ట్ర స్థాయిలో జరిగే బాయ్స్ స్టేట్ కార్యక్రమంలో ప్రతిభ చాటిన వారికి మాత్రమే జాతీయ స్థాయి బాయ్స్ నేషన్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన కేవలం 100 మందిని మాత్రమే ఎంపిక చేయడం ఈ కార్యక్రమ ప్రత్యేకత.
వాషింగ్టన్ డి.సి.లో వారం రోజుల పాటు అమెరికా సెనెట్ తరహాలో జరిగే ఈ మాక్ పార్లమెంటరీ సమావేశాల్లో విద్యార్థులు నేషనలిస్ట్స్ మరియు ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విభజించి చట్టాల రూపకల్పన, విధాన చర్చలు, ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాల్గొంటారు. ఈ కఠిన పోటీలో తన వాక్చాతుర్యం, నాయకత్వం, సమన్వయ నైపుణ్యంతో తోటి ప్రతినిధుల విశ్వాసాన్ని గెలుచుకున్న క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడం విశేషం.
ఈ ఎన్నికల్లో అర్కాన్సాస్ రాష్ట్రానికి చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్రిష్ కొర్రపాటి ఇప్పుడు అమెరికా యువ నాయకత్వంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు.
గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామ మూలాలు కలిగిన తెలుగు కుటుంబానికి చెందిన క్రిష్ కొర్రపాటి, డాక్టర్ వినీత్ కొర్రపాటి–స్మిత దంపతుల కుమారుడు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మధు కొర్రపాటి–శిరీష దంపతుల మనవడైన క్రిష్ ఈ అరుదైన విజయంతో తెలుగు వారి కీర్తిని అమెరికా రాజకీయ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు.
ఈ విజయంతో క్రిష్‌కు క్యాపిటల్ హిల్‌లో ఫెడరల్ అధికారులను కలిసే అవకాశం లభించడమే కాకుండా, అమెరికా అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం కూడా దక్కింది. భవిష్యత్తులో జాతీయ నాయకత్వానికి బాటలు వేసే ఈ ఘనతపై తెలుగు ప్రవాసులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా క్రిష్ తల్లి స్మిత తల్లిదండ్రులు గులివెందుల రమణమూర్తి, హేమలత తమ మనవడి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ఘనత ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణమని పేర్కొన్నారు.
అమెరికా రాజకీయ భవిష్యత్తు వైపు మరో తెలుగు అడుగు... క్రిష్ కొర్రపాటి విజయం ఇప్పుడు ప్రపంచ తెలుగు సమాజం గర్వంగా చెప్పుకునే విజయగాథగా నిలిచింది.













