అమెరికాకు చెందిన క్రైస్తవ మత సంస్థ ‘టిమోతీ ఇనిషియేటివ్‌’ (TTI)పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు రూ.92.55 కోట్ల విదేశీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో వినియోగించారన్న ఆరోపణలపై సంస్థతో పాటు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదైంది.

విదేశాల నుంచి వచ్చిన నిధులను అమెరికాలో జారీ చేసిన డెబిట్ కార్డుల ద్వారా భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి నగదుగా ఉపసంహరించుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, అసోం సహా పలు రాష్ట్రాల్లో ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం.

భారత్‌లో వెయ్యికి పైగా విదేశీ డెబిట్ కార్డులు పంపిణీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 2025 నవంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య ఈ కార్డుల ద్వారా సుమారు 99.9 లక్షల అమెరికన్ డాలర్లకు సమానమైన నిధులు ఉపసంహరించుకున్నట్లు కేసులో పేర్కొన్నారు.

ఈ కేసులో జొనాథన్ ఎస్. రాజన్, మైకా మార్క్, అజిత్ వర్గీస్ మాథై, బాబ్లు కుర్మీ, సుప్రీమ్ జాయ్, వర్గీస్ చాకోతో పాటు టిమోతీ ఇనిషియేటివ్‌, గుర్తుతెలియని మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA)తో పాటు ఇతర ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించారా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని కార్యకలాపాలకు ఈ నిధుల్లో కొంత భాగం వినియోగించారా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇంతకుముందే ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేపట్టింది. కర్ణాటకలో జరిగిన సోదాల్లో విదేశీ డెబిట్ కార్డుల వినియోగానికి సంబంధించిన వివరాలతో పాటు నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.