అమెరికా వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసి.. మంచి ఉద్యోగంతో జీవితాన్ని నిర్మించుకోవాలని కలలు కన్న ఓ తెలుగు యువతి ప్రయాణం విషాదాంతమైంది. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) అక్కడికక్కడే మృతి చెందారు.

రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయిన ప్రసన్న.. 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

మంగళవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. న్యూజెర్సీలో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమెతో ఉన్న ముగ్గురు స్నేహితులకు గాయాలయ్యాయి.

ఏకైక ఆశగా భావించిన పెద్ద కుమార్తె మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడివరం గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు. ప్రసన్న మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక ప్రసన్న భౌతికకాయాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.