తమిళనాడు రాజధాని చెన్నైకి రెండో విమానాశ్రయం నిర్మించేందుకు పరందూర్‌లో ప్రతిపాదించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతానికి నిలిపివేశారు. కాంచీపురం జిల్లాలోని పరందూర్ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికకు రైతులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.20 వేల కోట్లుగా అంచనా వేయగా, ఏటా కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అయితే భూసేకరణ, ప్రజల తరలింపు, పర్యావరణ ప్రభావంపై ఆందోళనలు పెరిగాయి.
పరందూర్‌ను ఎందుకు వద్దనుకున్నారు?
పరందూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు, చెరువులు, నీటి వనరులు, తడిభూములు ఉన్నాయి. విమానాశ్రయ నిర్మాణంతో వీటిపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎయిర్‌పోర్ట్ కోసం భూములు కోల్పోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు వ్యతిరేకించారు. కొంతమంది కుటుంబాలు తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేయాల్సి రావచ్చనే ఆందోళన కూడా వ్యక్తమైంది.
చెన్నైకి రెండో ఎయిర్‌పోర్ట్ అవసరమే
పరందూర్ ప్రాజెక్టును నిలిపివేసినప్పటికీ.. చెన్నైకి రెండో విమానాశ్రయం అవసరం లేదని ప్రభుత్వం చెప్పడం లేదు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పారిశ్రామిక అభివృద్ధి, కార్గో రవాణా అవసరాల దృష్ట్యా మరో విమానాశ్రయం అవసరమని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయంపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు దాని విస్తరణను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రత్యామ్నాయ ప్రాంతం కోసం అన్వేషణ
రైతులు, నీటి వనరులు, పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండేలా కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యామ్నాయ ప్రాంతాలను శాస్త్రీయంగా, సాంకేతికంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూసేకరణ వల్ల స్థానిక ప్రజలకు తక్కువ ఇబ్బందులు కలిగే ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వనుంది.
రైతుల్లో హర్షం
పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, ప్రజలు దాదాపు మూడేళ్లుగా నిరసనలు కొనసాగించారు. ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
తమ భూములు, జీవనోపాధి, నీటి వనరులను కాపాడుకునేందుకు చేసిన పోరాటానికి ఇది విజయమని నిరసనకారులు పేర్కొన్నారు.
రాజకీయంగా ముదురుతున్న వివాదం
ప్రాజెక్టు రద్దు నిర్ణయంపై తమిళనాడులో రాజకీయ వివాదం కూడా మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్ ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి ఇది ‘తిరిగి సరిదిద్దలేని ఎదురుదెబ్బ’ అని పేర్కొన్నారు.
అయితే సీఎం విజయ్ ప్రభుత్వం మాత్రం రైతుల జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే చెన్నై భవిష్యత్ విమానయాన అవసరాలను తీర్చేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తున్నామని చెబుతోంది.









