ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల హాకీ జట్టు గోల్స్ వర్షం కురిపిస్తోంది. థాయ్‌లాండ్‌తో జరిగిన పూల్-బి మ్యాచ్‌లో భారత్ 20-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పూల్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లో భారత డ్రాగ్-ఫ్లికర్ దీపిక సెహ్రావత్ చరిత్ర సృష్టించారు. ఆమె ఏకంగా 9 గోల్స్ సాధించారు. అంతేకాదు.. తన 8 గోల్స్ రికార్డును తానే అధిగమించి, ఏషియన్ గేమ్స్ మహిళల హాకీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. ఆమె చేసిన మొత్తం 9 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం.

భారత్ తరఫున నవనీత్ కౌర్ 4 గోల్స్, రుతుజా పిసాల్ హ్యాట్రిక్ సాధించారు. లాల్‌రెమ్సియామి, సాక్షి రాణా, కెప్టెన్ సలీమా టెటే, నేహా గోయల్ కూడా స్కోర్‌షీట్‌లో చోటు సంపాదించారు. థాయ్‌లాండ్ తరఫున సుపాన్సా సమాన్సో ఒక్క గోల్ చేశారు.

ఈ విజయంతో భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లో 56 గోల్స్ చేసి కేవలం 2 గోల్స్ మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చింది. ఉజ్బెకిస్థాన్‌పై 19-0, ఇండోనేషియాపై 17-1 విజయాల తర్వాత థాయ్‌లాండ్‌పై 20-1 విజయం సాధించింది.

అయితే భారీ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. భారత్‌కు అసలు పరీక్షలు ముందున్నాయని జట్టు భావిస్తోంది. తదుపరి మ్యాచ్‌లో 2018 ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ జపాన్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత జట్టు బలానికి మరింత కఠిన పరీక్షగా మారనుంది.