ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో భారీ సంచలనం చోటుచేసుకుంది. టాప్ సీడ్ అరినా సబలెంకా క్వార్టర్ ఫైనల్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. రష్యా ఆటగాళి డయానా షనైడర్‌ 3-6, 7-5, 6-0 తేడాతో సబలెంకాను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెట్‌ను కోల్పోయిన డయానా, రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను సమం చేసింది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకాకు ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించింది.

మరో క్వార్టర్ ఫైనల్లో పోలండ్‌కు చెందిన మాజా చ్వాలిన్స్‌కా 7-6, 6-3తో అన్నా కలిన్స్‌కయా పైవిజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ మెన్సిక్ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో అతడు ఫొన్సెకాను 6-3, 6-3, 7-6తో ఓడించి చివరి నాలుగులో చోటు దక్కించుకున్నాడు.