ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఓపెనింగ్ మ్యాచ్‌లోనే అభిమానులకు ఉత్కంఠభరితమైన హైడ్రామా కనిపించింది. మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభమైన తొలి 10 నిమిషాల్లోనే మెక్సికో తొలి గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 67వ నిమిషంలో మరో గోల్ కొట్టి విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్ మొత్తం మెక్సికో ఆధిపత్యం కొనసాగింది. బంతిపై 61 శాతం నియంత్రణతో పాటు 16 సార్లు గోల్ ప్రయత్నాలు చేసింది.
అయితే ఈ మ్యాచ్ ప్రత్యేకత గోల్స్ కాదు... ఏకంగా మూడు రెడ్ కార్డ్‌లు నమోదవడం. సౌతాఫ్రికా ఆటగాళ్లు స్ఫెఫెలో సిట్‌హోల్, టెంబా జ్వానే వరుసగా రెడ్ కార్డ్‌లు పొందగా, చివర్లో మెక్సికో డిఫెండర్ సీజర్ మోంటెస్ కూడా రెడ్ కార్డ్‌తో మైదానం వీడాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 9 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది.
ఫుట్‌బాల్‌లో ప్రమాదకరమైన టాకిల్స్, హింసాత్మక ప్రవర్తన లేదా తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు రెఫరీ రెడ్ కార్డ్ చూపిస్తారు. రెడ్ కార్డ్ పొందిన ఆటగాడు వెంటనే మైదానం వీడాల్సి ఉంటుంది. అతని స్థానంలో మరో ఆటగాడిని దింపే అవకాశం ఉండదు. సాధారణంగా తదుపరి మ్యాచ్‌కు కూడా నిషేధం విధిస్తారు.











