ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో నార్వేతో తలపడనున్న ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ సెంటర్-బ్యాక్ మార్క్ గుహీ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా కీలక మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

25 ఏళ్ల మాంచెస్టర్ సిటీ డిఫెండర్ గుహీ, మెక్సికోపై ఇంగ్లండ్ 3-2 తేడాతో విజయం సాధించిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. క్వార్టర్ ఫైనల్‌కు ముందు కాన్సాస్ సిటీలోని స్వోప్ సాకర్ ట్రైనింగ్ బేస్‌లో నిర్వహించిన చివరి సాధనలో ఆయన పాల్గొనలేదు.

గుహీ మైదానం చుట్టూ నడుస్తూ కనిపించినప్పటికీ, జట్టుతో కలిసి పూర్తి స్థాయి శిక్షణలో పాల్గొనలేదు. స్కై స్పోర్ట్స్ సహా పలు మీడియా కథనాల ప్రకారం గాయం తీవ్రంగా లేకపోయినా, నార్వేతో మ్యాచ్‌కు ముందు పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు సమయం చాలా తక్కువగా ఉంది.

అయితే, ఇంగ్లండ్ ప్రధాన కోచ్ థామస్ టుచెల్ మాత్రం గుహీ సమయానికి కోలుకుని మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే డిఫెన్స్‌లో మరో ఎదురుదెబ్బగా జారెల్ క్వాన్సా మెక్సికో మ్యాచ్‌లో రెడ్ కార్డ్ అందుకోవడంతో రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు.

గుహీ కూడా అందుబాటులో లేకపోతే, నార్వేతో జరిగే కీలక క్వార్టర్ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ డిఫెన్స్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి కోచ్ టుచెల్‌కు ఎదురుకానుంది. ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్ కోసం ఈ మ్యాచ్‌ను అత్యంత కీలకంగా భావిస్తోంది.