2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ నిర్వహణ కోసం 12 స్టేడియాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027 అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్న ఈ మెగా టోర్నీతో 24 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి చేరుకోనుంది.
ఈ 12 వేదికల్లో దక్షిణాఫ్రికాలో 8 స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాటిలో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం, సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్, కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, బ్లూమ్‌ఫొంటైన్‌లోని మంగౌంగ్ ఓవల్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ ఉన్నాయి.
జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, విక్టోరియా ఫాల్స్‌లోని ఫాలే మోసి-ఓ-టున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు వేదికలుగా ఎంపికయ్యాయి. నమీబియా రాజధాని విండ్‌హుక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ కూడా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ సీనియర్ టోర్నీకి నమీబియా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
ఈ ప్రపంచకప్‌లో 14 జట్లు పాల్గొంటాయి. సరికొత్త టోర్నీ ఫార్మాట్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. "త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్" అనే థీమ్‌తో ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే ఆఫ్రికా సంస్కృతిలోని 'ఉబుంటు' భావనను కూడా ఈ మెగా ఈవెంట్ ద్వారా ప్రతిబింబించనున్నారు.
ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ, 24 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ఆఫ్రికాకు తిరిగి రావడం ప్రపంచ క్రికెట్‌కు చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ టోర్నీ ఆఫ్రికాలో కొత్త తరం క్రికెటర్లకు స్ఫూర్తినివ్వడమే కాకుండా, అక్కడ క్రికెట్ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












