యూఎస్ ఓపెన్‌కు ముందు వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకాకు ఊహించని షాక్ తగిలింది. యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా జరుగుతున్న కెనడా ఓపెన్‌లో ఆమె ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సబలెంకా.. రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకటెరినా అలెగ్జాండ్రోవా చేతిలో 6-7 (3/7), 6-4, 4-6 తేడాతో ఓటమిపాలైంది.
తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన సబలెంకా.. రెండో సెట్‌లో పుంజుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. అయితే మూడో సెట్‌లో అలెగ్జాండ్రోవా దూకుడును అడ్డుకోలేక పరాజయం చవిచూసింది.
ఈ విజయంతో అలెగ్జాండ్రోవా.. వరల్డ్ నంబర్ వన్ సబలెంకాపై ఐదో విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు, డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో ఆమె తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
మరోవైపు అమెరికా స్టార్ జెస్సికా పెగులాకు కూడా నిరాశే ఎదురైంది. మూడో రౌండ్‌లో డయానా ష్నైడర్ చేతిలో 3-6, 3-6తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.









