భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి కీలక మార్పులు తీసుకురావడానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ CEA ప్రతిపాదనలు చేసింది. ఇకపై కొత్తగా ఏర్పాటు చేసే కొన్ని సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ESS)ను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది.
CEA ప్రతిపాదించిన ముసాయిదా సాంకేతిక ప్రమాణాల ప్రకారం.. 2027 జూలై 1 నుంచి ప్రారంభమయ్యే గ్రౌండ్-మౌంటెడ్ సోలార్, ఆన్‌షోర్ విండ్ ప్రాజెక్టులకు కో-లోకేటెడ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉండాలి. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఉండే హెచ్చుతగ్గులను సమర్థంగా నిర్వహించడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.
ఎంత స్టోరేజ్ ఉండాలి?
ప్రతిపాదిత ప్రారంభ నిబంధనల ప్రకారం.. ప్రాజెక్టు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 10 శాతం మేర స్టోరేజ్ సామర్థ్యం ఉండాలి. అలాగే ఆ స్టోరేజ్ కనీసం రెండు గంటల పాటు విద్యుత్‌ను నిల్వ చేయగలగాలి.
ఉదాహరణకు 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఉంటే.. కనీసం 10 మెగావాట్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది రెండు గంటల పాటు విద్యుత్‌ను నిల్వ చేయగల సామర్థ్యంతో ఉండాలి.
2029 నుంచి మరింత కఠిన నిబంధనలు
2029 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదించిన తదుపరి దశలో.. స్టోరేజ్ సామర్థ్యం ప్రాజెక్టు సామర్థ్యంలో 10 శాతంగానే కొనసాగినా, నిల్వ వ్యవధిని నాలుగు గంటలకు పెంచాలని CEA సూచించింది. అంటే 100 మెగావాట్ల ప్రాజెక్టుకు కనీసం 10 మెగావాట్ల నాలుగు గంటల స్టోరేజ్ అవసరమవుతుంది.
స్టోరేజ్ ఎందుకు అవసరం?
సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి సహజ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సోలార్ విద్యుత్ ప్రధానంగా పగటి సమయంలో ఉత్పత్తి అవుతుంది. అయితే సాయంత్రం, రాత్రి సమయంలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో స్టోరేజ్ సిస్టమ్స్‌లో ముందుగా నిల్వ చేసిన విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు.
భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో స్టోరేజ్ అవసరం కూడా భారీగా పెరుగుతుందని CEA అంచనా వేస్తోంది. 2031-32 నాటికి సుమారు 411.4 GWh ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యం అవసరం కావచ్చని అంచనాలు సూచిస్తున్నాయి.
గ్రిడ్ స్థిరత్వంపై కూడా దృష్టి
ఎనర్జీ స్టోరేజ్‌తో పాటు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లలో గ్రిడ్‌కు మద్దతు ఇచ్చే సామర్థ్యాలను కూడా పెంచాలని CEA ప్రతిపాదించింది. 2027 జూలై 1 నుంచి ప్రారంభమయ్యే పునరుత్పాదక ప్రాజెక్టుల్లో కనీసం 15 శాతం ఇన్వర్టర్లకు గ్రిడ్-ఫార్మింగ్ సామర్థ్యం ఉండాలని సూచించింది. బ్యాటరీ స్టోరేజ్‌కు సంబంధించిన పవర్ కన్వర్షన్ సిస్టమ్స్ కూడా నిర్దిష్ట గ్రిడ్-ఫార్మింగ్ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
ఇంకా తుది నిర్ణయం కాలేదు
ఇది ప్రస్తుతం CEA ప్రతిపాదించిన ముసాయిదా మాత్రమే. తుది నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ఈ ప్రతిపాదనపై పరిశ్రమలు, ఇతర భాగస్వామ్య వర్గాలు తమ సూచనలు, అభ్యంతరాలను 2026 అక్టోబర్ 4లోగా సమర్పించవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. భారత్‌లో సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనలో బ్యాటరీలు, ఇతర ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీల ప్రాధాన్యం మరింత పెరగనుంది. అదనపు పునరుత్పాదక విద్యుత్ వృథా కాకుండా నిల్వ చేసుకుని, అవసరమైన సమయంలో గ్రిడ్‌కు అందించేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.












