సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X కంటెంట్ క్రియేటర్ల కోసం Live Studio పేరుతో కొత్త లైవ్ స్ట్రీమింగ్ కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది. దీంతో లైవ్ ప్రసారాలను మరింత సులభంగా నిర్వహించే అవకాశం కల్పిస్తోంది. అలాగే ప్లాట్‌ఫామ్‌లో మరిన్ని లైవ్ స్ట్రీమ్‌లను ప్రోత్సహించేందుకు 1 మిలియన్ డాలర్ల క్రియేటర్ పేమెంట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది.
X హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ నికితా బియర్ మాట్లాడుతూ, రాబోయే పేమెంట్ సైకిల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసే క్రియేటర్లకు మొత్తం 1 మిలియన్ డాలర్లు కేటాయిస్తామని తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని ఎలా పంపిణీ చేస్తారన్న వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
కొత్త Live Studio ద్వారా క్రియేటర్లు స్ట్రీమ్‌కు టైటిల్, థంబ్‌నెయిల్ జోడించడం, ముందుగానే షెడ్యూల్ చేయడం, అలాగే ఎవరికి లైవ్ చూడటానికి అనుమతి ఇవ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. వెరిఫైడ్ యూజర్లు, సబ్‌స్క్రైబర్లు లేదా అందరికీ లైవ్ అందుబాటులో ఉంచే సదుపాయం కూడా ఉంది. అంతేకాకుండా వీక్షకుల కామెంట్లు, లైవ్ చూస్తున్న వారి సంఖ్య, వారు ఏ దేశం నుంచి చూస్తున్నారు, ఏ డివైస్ ఉపయోగిస్తున్నారు వంటి గణాంకాలను కూడా రియల్ టైమ్‌లో చూడొచ్చు.
ప్రస్తుతం Xలో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ నెలకు 3 డాలర్లు చెల్లించే X Premium సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త Live Studio పాత Media Studio Producer స్థానాన్ని భర్తీ చేయనుంది.
మొదటి దశలో ఈ సేవ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, అలాగే సిడ్నీ, సియోల్, ముంబై, సింగపూర్, పారిస్, టోక్యో వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే గతంలో X లైవ్ సేవలకు సాంకేతిక సమస్యలు ఎదురైన నేపథ్యంలో, ఈసారి కొత్త వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో చూడాల్సి ఉంది.












