మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 117 స్థానాలు గెలుస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది, కాంగ్రెస్‌కు 117 స్థానాలు కాదు కదా, 7 స్థానాలు కూడా రావని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం సీఎం స్వయంగా చేయించుకున్న సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు 78కిపైగా స్థానాలు వస్తాయని తేలిందన్నారు. మరో 4 సర్వేల్లో కూడా బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని నివేదికలు వచ్చాయని తెలిపారు.

తెలంగాణ భవన్‌లో శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కలేనని, తన సొంత సర్వేలోనే 78 సీట్లు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు. తాను సర్వే చేయించుకోలేదు అన్న విషయం నిజమైతే, దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలన్నారు. రాముడిపైన ఒట్టు వేసి అబద్ధాలు చెబితే రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. తన పాలన పట్ల అంత నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు లేదంటే అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఉప ఎన్నికలకు ఎన్నికలకు పోవాలని సవాల్ చేశారు.