
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) స్కీంను ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉద్యోగులకు అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు సిఎస్ వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని, దీని అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సిఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. క్యూఆర్ కోడ్‌తో నూతన హెల్త్ కార్డులు మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సిఎస్ తెలిపారు.
ఈనెల 13వ తేదీన ఆరోగ్యశ్రీ సీఈఓతో సమావేశం
అన్ని వివరాలతో ఈహెచ్సిటి యాప్ రూపొందించామని, చికిత్సలకు సిజిహెచ్ఎస్ రేట్లు వర్తింపజేస్తామని, నాలుగు రోజుల్లో నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాల జిఒ విడుదల చేస్తామని సిఎస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 943 హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 2,594 చికిత్సలు కవర్ అవుతాయని, నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాల కోసం సోమవారం ఆరోగ్యశ్రీ సీఈఓతో సమావేశం ఉంటుందని సిఎస్ తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతో అన్నీ జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతేక కార్యదర్శులు మహేశ్ దత్తాఎక్కా, శ్రీమతి క్రిస్టినా చోంగ్తూ, శ్రీమతి సిక్తా పట్నాయక్, హనుమంత్ కొండిబా,
షిఖా గోయల్, పాపిరెడ్డి, శ్రీమతి వాణిలతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మారం జగదీశ్వర్ (టిఎన్జీఓ అధ్యక్షుడు), ఏలూరి శ్రీనివాసరావు (టిజీఓ అధ్యక్షుడు), దామోదర్ రెడ్డి (పీఆర్టీయూ), చావా రవి (యూటిఎఫ్), శ్రీనివాసరెడ్డి (సెక్రటేరియట్ అసోసియేషన్), వంగా రవీందర్ రెడ్డి (ట్రెసా), సదానంద గౌడ్ (ఎస్టీయూ), సైదులు (ఎస్టీఎఫ్), దాస్య నాయక్ (క్లాస్-4 ఉద్యోగుల సంఘం), పెన్షనర్ల సంఘ ప్రతినిధులు వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, ఉమాదేవి,బి. శ్యామ్ (టిజిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు.









