
అమరావతి: పోగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసిపి యత్నిస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. పోగాకు రైతులకు వడ్డీ లేకుండా రూ. 50 వేల రుణం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేస్తామని ఎగుమతి దారులు రోజుకు 2 మిలియన్ కిలోల పొగాకు కొనేందుకు హామీ ఇచ్చారని తెలియజేశారు.వడ్డీలేని రుణాల వల్ల సుమారు 40 వేల మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుందని పెమ్మపాని పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాలని 2015 లో సిఎం చంద్రబాబు ఆలోచించారని, 2,700 ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించేందుకు జిఎంఆర్ అంగీకరించిందని అన్నారు. 2019 నాటికే సిఎం చంద్రబాబు 2,200 ఎకరాలు భూసేకరణ చేశారని, వైసిపి నేతలు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల మిగతా 500 ఎకరాలు సేకరించలేదని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి కొన్ని కేసులు విత్ డ్రా చేసుకుందని, వైసిపి సేకరించింది కేవలం 300 ఎకరాలు మాత్రమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టులో అవినీతి జరిగిందని జగన్ రీటెండర్ చేశారని, జగన్ రీటెండర్ చేయడంవల్ల భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ఆలస్యమైందని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టు మొత్తం తాము నిర్మిస్తే, వైసిపికి క్రెడిట్ ఎలా వస్తోంది? అని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.











