మన తెలంగాణ / హైదరాబాద్ : అవుటర్ రింగ్ రోడ్ క్యూర్ పరిథిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27 నుంచి నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి గౌతం తెలిపారు. ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల చొప్పున వరుసగా నాలుగు రోజుల పాటు ఈ నెల 30 వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని వివరించారు. క్యూర్ పరిథిలో లక్ష ఇండ్లను నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే పేరుతో హౌసింగ్ బోర్డు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గడవు ముగిసే సమయానికి మీసేవా కేంద్రాలతోపాటు, ఆన్ లైన్ లోనూ, వాట్సాప్ మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తుల

పరిశీలన జరుగుతోందన్నారు. దరఖాస్తు దారులు హైదరాబాద్ లో స్థిర నివాసముంటున్నారా లేదా, ఓఆర్ ఆర్ లోపల వారికి ఫ్లాట్, ప్లాట్ వంటివి ఉన్నాయా తదితర వివరాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు దారుల  వివరాలను గురువారం సాయంత్రం నుంచి https://ts.meeseva.telanga na.gov.in/, tghb.cgg.gov.in,tghb.telangana. gov.in ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నామని పేర్కొన్నారు. ఈ జాబితాలోని వివరాలపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు తెలియచేయవచ్చన్నారు. వచ్చిన అభ్యంతరాలన్నిటిని పరిశీలించిన అనంతరం ఇండ్లకోసం అర్హులైన దరఖాస్తు దారుల వివరాలతో తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తామని ఆయన వివరించారు.

27 నుంచి లాటరీ ప్రక్రియ

అర్హులైన దరఖాస్తుదారుల జాబితా రూపొందించిన తరువాత ఈ నెల 27 నుంచి లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు. ప్రతి రోజూ నాలుగు నియోజకవర్గాలు చొప్పున నాలుగు రోజుల పాటు వరుసగా లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపారు.పూర్తి పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వి.పి గౌతం పేర్కొన్నారు. రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా సమక్షంలో ఈ లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపారు. ఈ లాటరీ ప్రక్రియను యూట్యూబ్, తదితర మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ముందు ప్రకటించినట్లుగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, దివ్యాంగులు, తదితర రిజర్వేషన్ల ప్రకారం డ్రా తీస్తామని పేర్కొన్నారు. ప్రతి కేటగిరిలోనూ 20 శాతం వెయిటింగ్ లిస్టు కూడా రూపొందిస్తామని వీరిని కూడా లాటరీ డ్రా ద్వారానే ఎంపికి చేస్తామని పేర్కొన్నారు. ఇండ్ల కేటాయింపు విషయంలో ఎటువంటి సందేహాలు, అపోహలకు లోనుకావద్దని, పూర్తి పారదర్శకంగానే అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశంలో ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబరు 040 24603572 లో సంప్రదించవచ్చని సూచించారు.