
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా
వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్ఎలు, మాజీ ఎంఎల్సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.













