టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 ప్రపంచకప్ వరకూ వన్డే జట్టులో కొనసాగుతారా? లేదా? అనే విషయంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరి భవిష్యత్తుపై వారికి పూర్తి స్పష్టత ఇవ్వాలని బిసిసిఐ, జట్టు యాజమాన్యాన్ని భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కోరాడు. 2027 ప్రపంచకప్ కోసం టీం ఇండియా ప్రణాళికల్లో తాము ఉన్నామో, లేదో తెలుసుకునే హక్కు వారికి ఉందని అన్నాడు. రో-కో విషయంలో నెలకొన్ని అనిశ్చితి తన అంతర్జాతీయ కెరీర్ చివరి రోజులను గుర్తు చేసిందని పేర్కొన్నాడు.

‘‘రోహిత్, విరాట్‌ ప్రస్తుతం ఉన్నట్లువంటి పరిస్థితి నేను కూడా గతంలో ఎదుర్కొన్నా. వారు ఆడాలా? వద్దా అని నిర్ణయించే అధికారం అభిమానులకు లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది జట్టు యాజమాన్యం, కోచ్, సెలక్టర్లు. రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటే.. ‘మిత్రురాలా.. మీరు ప్రపంచకప్ ఆడాలని కోరుకుంటున్నాం. మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మైదానంలోకి వెళ్లి మీ సహజశైలిలో ఆడండి. ఒకవేళ ఏదైనా సిరీస్‌ సరిగా ఆడకపోతే జట్టులో స్థఆనం కోల్పోతామనే ఒత్తిడిని అస్సలు పెట్టుకోవద్దు’’ అని చెప్పాలని యువరాజ్ పేర్కొన్నాడు.