
నేపాల్‌లో వరదల అనంతరం మృతదేహాల గుర్తింపు అధికారులకు, బాధిత కుటుంబాలకు పెను సవాల్‌గా మారింది. పోఖరాలోని ఓ ఆసుపత్రిలో ఒకే మృతదేహాన్ని మూడు కుటుంబాలు తమ బంధువుదేనని ప్రకటించుకున్నారు. ఈ ఒక్క సంఘటన అక్కడ మృతదేహాల గుర్తింపులో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లకు అద్దం పడుతోంది. పోఖరా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోని మృతదేహం నంబర్ 1003ను బర్దియాకు చెందిన హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికుడు గోపాల్ దహిత్, రూపందేహికి చెందిన టూరిస్ట్ గైడ్ దామోదర్ బస్యాల్ కుటుంబాలు తమ బంధువుదేనని పేర్కొన్నాయి. మరో కుటుంబం కూడా తొలుత అదే మృతదేహంపై హక్కు వ్యక్తం చేసినట్లు నేపాల్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దహిత్, బస్యాల్ కుటుంబాల మధ్య మృతదేహం గుర్తింపుపై వివాదం కొనసాగుతుండగా, తుది నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు చేయించుకునేందుకు
రెండు కుటుంబాలు అంగీకరించాయి. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చేరడంతో వాటిని గుర్తించడం మరింత క్లిష్టంగా మారింది. మృతుల గుర్తింపులో ఫొటోలు, శారీరక లక్షణాలు, పళ్లు, చెవులు, పెదాలు, ముఖం, చేతులు, ఛాతీ, శరీర నిర్మాణం, వ్యక్తిగత వస్తువులు వంటి ఆధారాలను అధికారులు, కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు. పోఖరాలోని ఆసుపత్రి వద్ద మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. గుర్తుతెలియని మృతదేహాల ఫొటోలను పరిశీలిస్తూ వివిధ రకాల ఆకృతులు, ప్రత్యేక లక్షణాలతో పోల్చుకుంటున్నారు. ది కాఠ్మాండు పోస్ట్ కథనం ప్రకారం.. గోర్ఖా, తనహున్, ధాదింగ్, నావల్పరాసి ఈస్ట్ జిల్లాల నుంచి వెలికితీసిన 102 మృతదేహాలను పోఖరాకు తరలించారు. రాజధాని కాఠ్మాండుకు సుమారు 280 కిలోమీటర్ల దూరంలో పోఖరా ఉంది. సోమవారం నాటికి 16 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించగా, 87 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. గుర్తింపుపై వివాదాలు తలెత్తిన ఐదు కుటుంబాల బంధువుల నుంచి పోలీసులు డీఎన్ఏ నమూనాలను సేకరించారు.











