మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులతో ఆందోళనలో రాష్ట్రానికి జూలై నెలాఖరులో ఏర్పడిన అల్పపీడనం వరంగా మా రింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షా లు గట్టెక్కించాయి. జూన్ 1 నుంచి జూలై 31 వరకు నమోదైన మొత్తం వర్షపాతంలో దాదాపు మూడో వంతు వర్షం కేవలం గత ఐదు రోజుల్లోనే కురవడం విశేషం. దీంతో తీవ్ర లోటు పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడుతూ ప్రస్తుతం రాష్ట్రం సాధారణ వర్షపాతం కేటగిరీలోకి చేరుకుంది. రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిజిడిపిఎస్) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 31 వరకు 339.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సాధారణంగా ఈ కాలానికి 357.9 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండ గా ప్రస్తుతం లోటు కేవలం ఐదు శాతానికి పరిమితమైంది. అల్పపీడనం ప్రభావంతో కురిసి వర్షాలతో గత ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటివరకు నమోదైన మొత్తం వర్షపాతంలో దాదాపు 34 శాతం వర్షం కేవలం ఐదు రోజుల్లోనే కురిసింది. ఈ వర్షాలు లేకపోతే రాష్ట్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముండేదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై మూడో వారంలో అనేక జిల్లాల్లో 20 నుంచి 40 శాతం వరకు వర్షలోటు నమోదవగా, అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి.

నాలుగు జిల్లాల్లో అధిక వర్షపాతం

ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నాలుగు జిల్లాలు అధిక వర్షపాతం, 17 జిల్లాలు సాధారణ వర్షపాతం, 12 జిల్లాలు వర్షలోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లాలో 651 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 621.1 మిల్లీ మీటర్లు, మంచిర్యాలలో 596.8 మిల్లీ మీటర్లు, జగిత్యాలలో 544 మిల్లీ మీటర్లు, పెద్దపల్లిలో 541.4 మిల్లీ మీటర్లు, కామారెడ్డి 474.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జిల్లాలు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదు కాగా, మధ్య తెలంగాణ జిల్లాలు కూడా సాధారణ స్థాయికి చేరువయ్యాయి. దక్షిణ తెలంగాణలో మాత్రం ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతోంది. రాష్ట్రంలోని 12 జిల్లాలు ఇప్పటికీ వర్షలోటు కేటగిరీలోనే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయ తెలంగాణ జిల్లాల్లో లోటు కొనసాగుతోంది.

అత్యధిక లోటు నమోదైన జిల్లాల్లో జనగామ -44 శాతం ఉండగా, వరుసగా హనుమకొండ -44, వరంగల్ -43, మేడ్చల్- మల్కాజిగిరి 37, సూర్యాపేట -36, ఖమ్మం -36, యాదాద్రి భువనగిరి -33, వనపర్తి -32 శాతం ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఆగస్టు నెలలో మరిన్ని వర్షాలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. అయితే, నైరుతి రుతుపవనాల ప్రధాన కాలమైన ఆగస్టు, సెప్టెంబరు నెలలు ఇంకా మిగిలి ఉండటంతో రాష్ట్రం మొత్తంగా సాధారణ వర్షపాతం లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు కూడా రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.