
దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ’ఐ యామ్ గేమ్’ ట్రైలర్ విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. “ఐయామ్ గేమ్ ట్రైలర్‌లోని ఆ ఫైరీ వైబ్ నాకు బాగా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది. నా సోదరుడు దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నారని నమ్మకం కలిగింది. తనకి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతనితో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు”అని ట్వీట్ చేశారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 20న ఓణం కానుకగా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ వేఫేరర్ ఫిలమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా, సాజిర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు. విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే ఎడ్జ్- ఆఫ్ -ది- సీట్ ఎంటర్‌టైనర్‌ను వాగ్దానం చేస్తోంది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కాయడు లోహర్, కథిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.











