
ఛార్జింగ్ లేకపోవడంతో ఓ అమ్మాయి ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ కారు మార్గ మద్యంలోనే ఆగిపోయింది. అప్పుడు భారత సైన్యానికి చెందిన ఓ జవాను ఆమెకు మర్చిపోలేని సాయం చేసి.. రియల్ హీరో అనిపించుకున్నాడు. దీపికా శర్మ అనే వ్లాగర్ సోషల్‌మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో తాను ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇవి వాహనంలో 60 శాతం వరకు చార్జింగ్ ఉందని.. కొంత సమయం తర్వాత అది 10 శాతానికి పడిపోయిందని పేర్కొంది.
స్థానికంగా ఓ ఛార్జింగ్ స్టేషన్ ఉందని తెలుసుకుని అక్కడి వెళ్తుండగా.. అప్పటికే బ్యాటరీ 2 శాతానికి పడిపోవడంతో వాహనం నిలిచిపోయింది. దీంతో చేసేదేం లేక ఆమె అక్కడే ఉన్న సైనికుడిని సాయం అడిగింది. వెంటనే స్పందించిన జవాన్ ఆమెను కారులో కూర్చొబెట్టి ఛార్జింగ్ స్టేషన్ వరకూ కారు తోసుకుంటూ వెళ్లారు. అంతేకాకుండా ఛార్జింగ్ పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి.. ఆమె అక్కడి నుంచి బయలు దేరిన తర్వాత తిరిగి వెళ్లారు. ఈ ఘటన రికార్డు చేసిన దీపికా శర్మ.. జవాన్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజల కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలిపింది.











