అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. మసాచుసెట్స్‌ రాష్ట్రం ఆ రోజును ‘ఇండియా డే’గా ప్రకటించింది. తమ రాష్ట్రానికి భారత సంతతి ప్రజటు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ మౌరా హీలీ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.

‘‘భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. విభిన్న జాతులు, మతాలు భాషలు, ఆచారాలు అక్కడ ఉన్నాయి. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ భారతీయులు అందరిలో ఐక్యత కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో 3.6 కోట్ల మంది భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. అమెరికాలోనే 50 లక్షలకు పైగా భారతీయ ప్రజలు ఉన్నారు. సామాజిక, పౌర, ఆర్థిక రంగాల్లో అమెరికాకు వీరు విశేష సేవలు అందిస్తున్నారు. వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, విద్య, వ్యాపారం, ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని మసాచుసెట్స్ గవర్నర్ పేర్కొన్నారు.