
ప్రతి సంవత్సరం ఆగస్టు 3ను భారతదేశంలో జాతీయ హృదయ మార్పిడి దినోత్సవంగా పాటిస్తారు. ఈ రోజు ఉద్దేశ్యం అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా గుండె దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చనే అవగాహన కల్పించడం.
గుండె వైఫల్యం చివరి దశకు చేరుకున్న రోగులకు మందులు, యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ శస్త్రచికిత్సలు కూడా ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ప్రాణాలను కాపాడే మార్గంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు మరణం చెందిన దాత గుండెను సరైన రోగికి మార్పిడి చేయడం ద్వారా అతనికి కొత్త జీవితం అందించవచ్చు.
భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్లు, సమర్థవంతమైన అవయవ రవాణా వ్యవస్థ వల్ల ఈ చికిత్స విజయవంతంగా జరుగుతోంది. అయినప్పటికీ, మన దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య ఇంకా అవసరానికి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా అనేక మంది రోగులు సరైన సమయంలో గుండె దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు.
అవయవదానంలో అత్యంత కీలకమైన అంశం బ్రెయిన్ డెత్‌ను గుర్తించడం, కుటుంబ సభ్యుల సమ్మతి. ఒక వ్యక్తి మరణానంతరం దానం చేసిన గుండె ఒకరికి, కాలేయం మరొకరికి, మూత్రపిండాలు ఇంకొద్దిమందికి, కళ్ల ద్వారా మరికొందరికి వెలుగును అందించవచ్చు. అంటే ఒక అవయవదాత ఎనిమిది మందికి పైగా కొత్త జీవితాన్ని ఇవ్వగలడు.
ఈ జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అవయవదానం గురించి సరైన అవగాహన పెంపొందించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఈ విషయంపై ముందుగానే చర్చించాలి. అవయవదానం అనేది మరణానంతరం కూడా మనిషి చేసే అత్యున్నత మానవతా సేవ. “అవయవదానం చేయండి… మరణానంతరం కూడా పలువురి గుండెల్లో చిరస్థాయిగా జీవించండి.”
డా. చింతా ప్రభాకర రెడ్డి
ప్రొఫెసర్ & హెడ్, కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కర్నూలు











