న్యూఢిల్లీ : బీహార్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) సంస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహాయే పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. 2023లో ఈ పార్టీ ఏర్పాటైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎలో కీలక భాగస్వామిగా ఈ పార్టీ ఉంటోంది. ఈ పార్టీకి బీహార్‌లో నలుగురు ఎమ్‌ఎల్‌ఎలుండగా, రాజ్యసభ సభ్యునిగా కుష్వాహా ఉన్నారు. ఆయన కుమారుడు దీపక్ ప్రకాష్ శాసనమండలి లేదా శాసన సభ సభ్యుడు కాకపోయినా బీహార్ లోని ఎన్‌డిఎ ప్రభుత్వ మంత్రిగా ఉన్నారు. న్యూఢిల్లీ లోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో రోజంతా సమావేశంలో చర్చలు జరిపిన తరువాత పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉపేంద్ర కుష్వాహాను ఎంపిక చేయడమైందని ఆర్‌ఎల్‌ఎం ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడేళ్ల పాటు ఆయన పార్టీ అధ్యక్షునిగా ఉంటారని పేర్కొంది.