ప్రపంచంలోనే కీలక ఆర్థికశక్తిగా భారత్ ఎదుగుతోందని, అతిపెద్ద ఆర్థికవ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నామంటూ నరేంద్ర మోడీ ప్రభు త్వం చేస్తున్న ప్రచారాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక తేల్చిచెప్పింది. ఐఎంఎఫ్ తాజా ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్) ప్రకారం, ప్రపంచ జిడిపి ర్యాంకింగ్స్‌లో భారత్ ఆరవ స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు నాల్గవ స్థానంలో ఉండగా, మరో రెండు మూడేళ్లలో మూడవ స్థానానికి చేరబోతున్నామని, 2047 నాటికీ మొదటి స్థానానికి చేరుకోగలమని అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంచనాలు తలకిందులై భారత్ ఆరవ స్థానంకు దిగజారింది.

అదే సమయంలో తాజా కాగ్ నివేదిక భారత ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇటువంటి కీలక ఆర్థిక పరిణామాలపై ప్రభుత్వం మౌనం వహిస్తుండటం గమనిస్తే ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నాలే స్పష్టం అవుతున్నాయి. ప్రస్తుత యుఎస్ డాలర్లలో నామమాత్రపు జిడిపిపరంగా జపాన్, యుకె భారత్‌ను అధిగమించాయి. అయితే, 2026 నాటికి, భారత ఆర్థిక వ్యవస్థ విలువ అంతకుముందు సంవత్సరం ఉన్న $ 3.92 ట్రిలియన్ల నుండి $ 4.15 ట్రిలియన్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. మరోవంక, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఖాతాలలో విస్తృతమైన అవకతవకలు జరిగినట్లు భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదించారు.

ఇందులో రూ. 54,000 కోట్లకు పైగా విలువైన వినియోగ ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉండటం, నిధుల వర్గీకరణలో భారీస్థాయి తప్పులు, ఆర్థిక నియంత్రణ వ్యవస్థలలో దీర్ఘకాలిక బలహీనతలు వంటి అంశాలు ఉన్నాయి. ఏప్రిల్ ప్రారంభంలో పార్లమెంటులో సమర్పించిన కాగ్ తాజా నివేదికలో పొందుపరిచిన ఈ పరిశీలనలు, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, నివేదికల తయారీలో వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతున్నాయి. అనేక మంత్రిత్వ శాఖలు ‘సహాయకగ్రాంట్లు’ రూపంలో విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి సరైన లెక్కలను చూపడంలో విఫలమయ్యాయి. మార్చి 31, 2025 నాటికి, 15 మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో మొత్తం 33,973 వినియోగ ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ. 54,282.32 కోట్లు. ఈ పెండింగ్ మొత్తంలో రూ. 38,287.52 కోట్లు గత మూడు ఆర్థిక సంవత్సరాలకు (2021-22 నుండి 2023-24 వరకు) సంబంధించినవి కాగా, కొన్ని కేసులు దాదాపు నాలుగు దశాబ్దాల వెనుకటి 1985-86 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవిగా ఉన్నాయి. నిధులు ఉద్దేశించిన ప్రయోజనాల కోసమే వినియోగించినట్లు ధ్రువీకరిస్తూ, 12 నెలల లోపు వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని నిర్దేశించే ‘సాధారణ ఆర్థిక నియమాలు’, 2017లోని నియమం 238ని ఈ జాప్యం ఉల్లంఘిస్తుంది.

పెండింగ్‌లో ఉన్న వినియోగ ధ్రువీకరణ పత్రాల విషయంలో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యధిక వాటాను (రూ. 18,272.91 కోట్లు) కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్నత విద్యా శాఖ రూ. 14,359.76 కోట్లతో నిలిచింది. ఇలా ఉండగా, భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పెరుగుతున్నప్పటికీ ప్రతి భారతీయుడి సగటు తలసరి ఆదాయం పొరుగున ఉన్న చిన్న దేశమైన బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉందని వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తుంది. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది బంగ్లాదేశ్ తలసరి జిడిపి 2,911 డాలర్ల (రూ. 2.73 లక్షలు)కు చేరుతుందని అంచనా వేసింది.ఇదే సమయంలో భారతీయుల తలసరి ఆదాయం 2,812 డాలర్లు (రూ. 2.64 లక్షలు)గా ఉండొచ్చని పేర్కొంది. ప్రభుత్వ వర్గాలు భారత్‌ను విశ్వగురువుగా, ఆర్థికశక్తిగా అభివర్ణిస్తున్నప్పటికీ ఆ వృద్ధి తాలూకు ఫలాలు సామాన్యుడికి అందడం లేదనే విమర్శలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ముడి పదార్థాల భారంతో భారత్ ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026- 27లో దేశవృద్ధి 6 శాతానికి క్షీణించొచ్చని తాజా రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇంతక్రితం వేసిన 6.8 శాతం అంచనాతో పోల్చితే భారీ తగ్గుదల నమోదు కానుంది. పెరిగిన ఇంధన ధరల వల్ల ప్రయివేటు వినియోగం తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడం ఇందుకు ప్రధాన కారణాలని మూడీస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఇంధన ధరలు ఎగిసిపడటంతో భారత్ వాణిజ్య లోటు పెరగనుందని మూడీస్ హెచ్చరించింది. తద్వారా ప్రభుత్వం ఇంధనం, ఎరువుల రాయితీలకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని మూడీస్ పేర్కొంది. ముఖ్యంగా భారత్ తన చమురు, గ్యాస్ అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల సరఫరా వ్యవస్థలో ఆటంకాలు కలిగే ముప్పు ఉందని పేర్కొంది.

సిమెంట్, కెమికల్స్, విమానయాన వంటి ఇంధన ఆధారిత పరిశ్రమలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఏదిఏమైనా ఆర్ధిక వ్యవహారాలలో ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించాలి. కేవలం ప్రచారం కోసం వాస్తవాలను కప్పిపుచ్చడం ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో దేశంలో చమురు నిల్వల గురించిన వాస్తవాలను వెల్లడించక పోవడంతో ప్రజలలో ఓ రకమైన భయాందోళనలు చెలరేగడం గమనార్హం. చైనా, జపాన్ వంటి దేశాలతో పాటు ఐరోపా, ఆగ్నేసియా దేశీయలు పుష్కలంగా చమురు నిల్వలను ఉంచుకొంటూ ఉండడంతో అంతగా ఖంగారు పడాల్సిన పరిస్థితులు ఆయా దేశాల్లో ఏర్పడకపోవడం గమనార్హం.


చలసాని నరేంద్ర

98495 69050