
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలనే హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎంఎల్ఎ కెపి వివేకానంద తెలిపారు. పేదల ఇళ్లను కూల్చి పెద్దల చేతిలో పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతోందని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు బడా లీడర్స్ లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు చేశారు. కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. హైడ్రా అనేదే పెద్ద డ్రామా అని, చెరువులను, ప్రభుత్వ భూములను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ, పేద ప్రజలను మోసం చేస్తున్నారని వివేకానంద ధ్వజమెత్తారు. హైకోర్టులో ఎంతమంది హైడ్రాను వ్యతిరేకిస్తే, ఈ రోజు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఉన్నత న్యాయస్థానం అని చురకలంటించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందే చెప్పారని, హైడ్రా అనేది పేదలకు పెద్ద శాపం అని, బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా ను బొంద పెడతామన్నారు.
కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ టిఎల్, ప్రభుత్వ భూమి అని ఇష్టం వచ్చినట్లు పేదల ఇల్లు కూల్చివేశారని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తుందని, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చామని, అవేవీ పట్టించుకోకుండా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వివేకానంద దుయ్యబట్టారు. హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుని పరిపాలన సాగిస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అనేక తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్తున్నారు తప్పితే.. ప్రజలకిచ్చిన మాటలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. హైడ్రా కమిషనర్ కు తొమ్మిది తలల సర్పం అని హైకోర్టు చెప్పిందని, రేవంత్ ఇంకో తల ఎక్కువ ఉందని, పది తలల రావణుడిలా వ్యవహరిస్తున్నారని వివేకానంద ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.











