మానవత్వం గురించి తెలుసుకోవాలంటే మానవసమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపట్ల కొంత అవగాహన అవసరం. మానవ జాతి పుట్టుకలో ఆదిమ జాతులు ముఖ్యమైనవి. ఆదివాసేతరులు తమ మూలాలు ఆదిమ సమాజాల్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ముందు మానవత్వం పరిమళించిన ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవి గురించి తెలుసుకోవాలి. మహాశ్వేతా దేవి ఆ ఆదిమ సమాజ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆదివాసులు గురించి తన జీవితమంతా రాశారు. వారి తరపున పోరాడారు. ఆదివాసుల జీవితాల గురించి, పోరాటాల గురించి తనవంటి ఆదివాసేతరులకు చెప్పడానికి రాశారు. చాలా మంది ఆదివాసేతరులలో సాహిత్యం ద్వారా తనవంటి సహానుభూతిని కలిగించారు. వారిని చైతన్యపరిచారు. అణగారిన వర్గాల గుండె చప్పుడుగా, అడవి బిడ్డల హక్కుల కోసం గొంతెంతిన సామాజిక ఉద్యమకారిణిగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకొని, వారి జీవితాలకు తన రచనలతో నిలుపుటద్దం పట్టారు. మహాశ్వేతాదేవి దేశంలోనే అత్యుత్తమ రచయిత్రిగా ఎంత గుర్తింపు పొందారో, ఆదివాసీల హక్కుల కోసం నిలబడి పోరాడిన కార్యకర్తగా కూడా అంతే గుర్తింపు పొందారు.

ఆదివాసేతరులు ఆమెను ప్రేమగా ‘దీదీ’ అని పిలుచుకుంటే, ఆదివాసులు కూడా ఆమెను ప్రేమగా ‘మారందాయి’ గా పలకరించేవారు. నాగరిక ప్రపంచం, అనాగరిక చర్యలకు ఊపిరాడని అడవి బిడ్డలకు శ్వాసనిచ్చినతల్లి, ఊతమిచ్చినశక్తి మహాశ్వేత. గిరిజనుల గాయాల్ని, రుధిర ధారలుగా అక్షరబద్దం చేసిన నిబద్ధత మహాశ్వేతా దేవికే సొంతం. నవమాసాలు మోసి, కన్నకొడుకునే ఉద్యమానికి బలిచ్చిన త్యాగశీలి మహా శ్వేతాదేవి. అలుపెరుగని విశ్వాసంతో, నిరంతర కృషితో, సముద్రమంత కష్టాన్ని కూడా మోకాటిలోతే అన్నచందాన తన జీవన గమనాన్ని సాగించిన స్ఫూర్తి ప్రదాత మహాశ్వేత. 1926, జనవరి 14న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మధ్యతరగతి కుటుంబమైన మనీష్ ఘటక్, ధరిత్రీదేవిలకు మహాశ్వేత జన్మించారు. తల్లి సామాజిక కార్యకర్త తండ్రి ప్రసిద్ధ సాహితీవేత్త ప్రతిభావంతమైన కుటుంబ నేపథ్యంలో ఆమె బాల్యం గడిచింది. వారు దేశ విభజన సమయంలో కుటుంబంతో సహా భారత్ వచ్చి పశ్చిమబెంగాల్లో స్థిరపడ్డారు. ‘బహుశా 1980 నుండి నేను సామాజిక పోరాటాన్ని ఉధృతం చేశాను.

గొంతు విప్పాను. ఆదివాసులు, గిరిజనులు, భూములేని గ్రామీణ పేద ప్రజలు, కూలీలు, నగరాల్లో ఫుట్‌పాత్ జీవులు ఇట్లా వారి పక్షాన సమస్యలపై నా దినచర్యగా ప్రతిస్పందించాను.భారతదేశంలో స్వాతంత్య్రం ఎన్ని తప్పిదాలతో, ఎన్ని తప్పు నడకలతో ముందుకు వచ్చిందో విప్పి చెప్పగలిగాను. దేశంలో ప్రతి భాషలో ఇంకా పుస్తకాలు రాయబడాలి. ముద్రించబడాలి, అణగారిన ప్రజల జీవిత కథలు ప్రవహించాలి, ప్రతి ఒక్కరి చేతివేళ్ళు అక్షరాలకోసం అంగలార్చాలి, మూగబోయిన గొంతు విప్పాలి. గతంలోనైనా, ఇపుడైనా, భవిష్యత్తులోనైనా మనమంతా కలలు గనేది మానవీయ విలువల కోసమే’ అంటూ 2006, అక్టోబర్ 21న మహాశ్వేతాదేవి జర్మనీ- ఫ్రాంక్ ఫర్డ్ బుక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతిమంగా ‘కలలకు స్వాతంత్య్రం కావాలి. తమ లాంటి రచయితల కలాలకు స్వేచ్ఛ కావాలి’ అని నిరంతరం తన ప్రసంగంలో చెప్తుండేవారు మహాశ్వేత.

మహాశ్వేత ఒక్కొక్క కథ గిరిజనుల జీవితంలోని ఒక విషాద గాథలను వివరిస్తుంది. శనిచరి కథలో వ్యభిచార కూపాలలోకి బలవంతంగా కూరుకుపోతున్న వంగ ప్రాంతానికి చెందిన గిరిజన బాలిక విషాద కథ. ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకు వెళ్ళి ఆ బాలికల చేత వ్యభిచారం చేయిస్తూ ఉంటారు దళారులు. అది భరించలేని ఎంతోమంది ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. శనిచరి మాత్రం కడుపున పుట్టిన బిడ్డతో సహా తిరిగి గ్రామంలోకి వచ్చి తనతప్పుకు అపరాధం చెల్లిస్తుంది. అయినా గిరిజన సమాజం ఆదరించదు. రైలు పట్టాలమీద బొగ్గు ముక్కులను ఏరుకుంటూ బతుకీడుస్తున్న దైన్యం, ఆ బొగ్గుముక్కలే నిప్పురవ్వల్లాంటి ప్రశ్నలను సంధిస్తాయి. ‘జీవిత ఖైదీ’ కథలో ‘మకర సవర’ అనేది వర్తమాన చరిత్రలోని ఒక ఘోరంతో కూడిన అల్లకల్లోలమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. ఇది సవర తెగలో పుట్టిన మకర అనే గిరిజనుడి వైవాహిక సంఘర్షణ.

పెళ్ళయిన చాలా కాలానికి కూడా అతని భార్యకు గర్భం కాకపోవడంతో ఆమె స్వయంగా విడాకులు కోరుకుంటుంది. నిస్పంతువుగా ఉండటం ఆ తెగలో నిషిద్ధం. గ్రామపెద్దలకు హఠాత్తుగా తెలుస్తుంది అసలు సంగతి. అతనికి పిల్లలు పుట్టకుండా, రహస్యంగా శస్త్రచికిత్స చేశారని! గిరిజన సాంప్రదాయాన్ని 1975 నాటి అత్యవసర పరిస్థితులలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో ఎలా సంక్షుభితం చేశాయో వర్ణించే కథ ఇది. 1997లో విశాఖపట్నం వచ్చిన మహాశ్వేత విశాఖ మన్యంలో గొప్ప మన్యంపితూరీ నడిపిన అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా ఆయన శతజయంతి (1997)ని పురస్కరించుకొని నవల రాస్తానని చెప్పారు. అలాగే విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ‘మూల వలస’ గూడాన్ని కూడా సందర్శించి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నవల రాస్తానని ప్రమాణం చేశారు. ఆదివాసీల పరిశోధనలో భాగంగా ఆమె తెలంగాణ గిరిజన పోరాటాలపై విస్తృత సమాచారం కూడా సేకరించారు. సామాజిక అణచివేతలపై తిరగబడ్డ ఘనచరిత్ర గల కుమ్రంభీం వంటి ఆదివాసీ పోరాట యోధులు ఉన్నట్లు ఆమె గ్రహించారు. అడవి సంరక్షణ, ఆదిమ జాతుల వారు రక్షితులుగా రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకునేలా ప్రయత్నాలు జరిగితే... అదే మహాశ్వేతకు మనం అర్పించే నిజమైన నివాళి!

- గుమ్మడి లక్ష్మీనారాయణ

94913 18409