మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ రాజకీయ ప్రధాన లక్ష్యమని, అధికారం కోసం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు, ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడటమే ఉద్యమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మక్డుం భవన్ లో సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కూనంనేని సాంబాశివరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, విద్యా-వైద్య రంగాల ప్రైవేటీకరణ, కార్మిక-రైతు వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున నిరంతరం పోరాడుతూ, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ఈ నెల 6 నుండి 14 వరకు పార్టీ నిర్వహించే ప్రచార యాత్రలను అన్ని నియోజకవర్గాల్లో, డివిజన్లలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయడం సిపిఐ సంప్రదాయమని తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవాలంటే ప్రజా ఉద్యమాలే అసలైన మార్గమని, అదే కమ్యూనిస్టు రాజకీయాల మూల సూత్రమని పేర్కొన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలు ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే కీలక అవకాశమని కూనంనేని అన్నారు. ప్రజల మధ్య నిరంతరం పనిచేసిన, సేవా దృక్పథం కలిగిన సిపిఐ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన సూచించారు.

కాలనీలు, బస్తీలు, శ్రామికవాడలు, పేద ప్రజల సమస్యలను తమ ఎన్నికల ఎజెండాగా తీసుకుని ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్ బోస్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల విజయంతో ప్రజల గొంతుక స్థానిక సంస్థల్లో బలపడుతుందని, అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే కమ్యూనిస్టు నాయకత్వాన్ని గెలిపించి స్థానిక పాలనలో పారదర్శకత, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, దర్మేంద్ర, స్వామి, లక్ష్మణ్, రచ్చ కిషన్, హరినాథ్ రావ్, నర్సింహా సత్యప్రసాద్, శ్రీనివాస్, హైమావతి, రవిచంద్ర, ప్రమీల, వెంకటాచారి, వెంకటరెడ్డి, అన్వర్, నరేంద్ర ప్రసాద్, యాదగిరి, నాగరాజు, మాధవి,లత, బాపిరాజు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.