
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే మాట మీద నిలబడాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం విశ్వసనీయత అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడి అనేక డిమాండ్లు చేయడం ఒక ఎత్తయితే అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ఇలా ఏ పార్టీ అయినా సరే కేంద్రంలో లేదా రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్నప్పుడు గతంలో ఇచ్చిన హామీలను విస్మరించకూడదని ఆయన సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల అధికార పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహారించాలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకొని ప్రశ్నించిన వారే అధికారంలోకి రాగానే మౌనం వహించడం లేదా
మాట మార్చడం ప్రజలను మోసం చేయడమే అవుతుందని ఆయన అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శించకూడదని ఆయన సూచించారు. ముఖ్యంగా ఆర్టీసి సమ్మె తీవ్రంగా కొనసాగుతున్న వేళ జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కార్మిక వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడే దమ్ము ఒక్క జగ్గారెడ్డికే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన విడుదల చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా ఆర్టీసి సమ్మె నేపథ్యంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచింది. అధికారంలోకి వస్తే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీని మేనిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే.










