
హాంగ్‌ఝౌలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో ఈ హైదరాబాదీ షూటర్ నిలకడగా ప్రదర్శించి 40 హిట్స్‌తో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలో కాంస్య పతకం కోసం మనూ బాకర్ పోరాడాల్సి వచ్చింది. షూట్ ఆఫ్‌ను దాటుకుని వచ్చిన మనూ.. 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. అంతకు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. మనూ బాకర్ 586-20x స్కోర్‌తో అగ్రస్థానంలో నిలవగా.. 21 ఏళ్ల ఇషా సింగ్ 585-18x స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఫైనల్‌లో మాత్రం అదిరిపోయే ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది.











